పవన్ దూకుడు..బీజేపీ నేతతో కయ్యం.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అధికార వైసీపీపై పోరుని ఉదృతం చేశారు. తనదైన శైలిలో ఆవేశంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం సభలో వైసీపీని, పలువురు మంత్రులని గట్టిగా టార్గెట్ చేసిన పవన్..తాజాగా మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో…వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల సొంతమని అర్థమని, వైసీపీ సొంతమని కాదు… సజ్జల సొంతమని కాదని,  మనందరి సొంతమని అన్నారు.

అదే సమయంలో ఒకసారి వామపక్షాలతో వెళ్తావు… మరోసారి బీజేపీతో వెళ్తావని మాట్లాడతారని, “నువ్వు కమ్యూనిస్టా, మార్క్సిస్టా” అని చాలామంది అడుగుతారని, కానీ తాను హ్యూమనిస్టునని చెబుతానని, ప్రజల అవసరాల కోసం మారతాను అంతే అని పొత్తులపై చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆ మధ్య ఉత్తరాంధ్ర సెపరేట్ రాష్ట్రం కావాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావుపై, ఇటు రాయలసీమని సెపరేట్ రాష్ట్రంగ చేయాలన్న బి‌జే‌పి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై పవన్ విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ఏదైనా పార్టీ లేదా వ్యక్తులు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తన లాంటి తీవ్రవాదిని మరొకసారి చూడరని, ఇప్పటికే విసిగిపోయామని, అవినీతిలో మునిగిపోయిన, పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా… మేం చూస్తూ కూర్చొంటామా? ఇంకొక్కసారి ఏపీని విడగొడతామంటే.. తోలు తీసి కింద కూర్చోబెడతామని ఫైర్ అయ్యారు.

అయితే పవన్ వ్యాఖ్యలపై బి‌జే‌పి నేత బైరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎవరి తోలు తీస్తారో.. ఎవరు ఎవరి తొక్క తీస్తారో.. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద తేల్చుకుందామా? అంటూ సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ జీవితంలో మోసాలు తప్ప ఇంకేమీ లేవని, రాయలసీమలో పవన్ కల్యాణ్‌కు ఉప్పు కూడా పుట్టదని, రాయలసీమ ఉద్యవాదాన్ని అణచివేయడానికి పవన్ కల్యాణ్ ఏమైనా పోలీసు అధికారా? అని ప్రశ్నించారు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి