యువగళం జోరు..టీడీపీకి కొత్త ఊపు.!

ఎట్టకేలకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టి‌డి‌పి నేతలు, శ్రేణులు పాదయాత్రలో పాల్గొని సక్సెస్ చేశారు. అటు లోకేష్ ప్రజలని కలుసుకుంటూ ముందుకెళ్లారు. పాదయాత్రలో బాలయ్య, తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు రావడంతో..ఆయన్ని కుప్పం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి వైద్యులని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లే తెలుస్తోంది. హాస్పిటల్ వద్ద బాలయ్య ఉండి మొత్తం చూసుకుంటున్నారు.

ఈ ఒక్క విషాదం మినహా..పాదయాత్ర సజావుగా సాగిపోయింది. అలాగే కుప్పంలో భారీ సభ జరిగింది. పెద్ద ఎత్తున టి‌డి‌పి శ్రేణులు సభలో పాల్గొన్నారు. అయితే ఎప్పుడు నిరంతరాయంగా స్పీచ్ ఇవ్వని లోకేష్..కుప్పం సభలో అనర్గళంగా స్పీచ్ ఇచ్చారు. అక్కడకక్కడ కాస్త తడబడిన జగన్ ప్రభుత్వంపై పవర్‌ఫుల్ పంచ్‌లు వేశారు. దూకుడుగానే ఆయనే స్పీచ్ ఉందని టి‌డి‌పి శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. గతంతో  పోలిస్తే ఆయన స్పీచ్‌లు పూర్తిగా మారిపోయాయి. మొత్తానికి లోకేష్ లో బాగా మార్పు కనిపిస్తోంది.

అందుకే లోకేష్ స్పీచ్ అవ్వగానే వైసీపీ నేతలు వరుసపెట్టి లోకేష్‌కు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఆయన వైసీపీపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. మొత్తానికి చూసుకుంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటిరోజు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక మిగిలిన రోజులు ఏ విధంగా ముందుకెళ్తారు..పార్టీకి ఏ మేర బలం పెంచుతారనేది చూడాలి. కానీ లోకేష్ పాదయాత్ర కొంతమేర టీడీపీకి కొత్త ఊపు తీసుకొచ్చిందనే చెప్పాలి.