లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?

మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టి‌డి‌పి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు.

బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి దర్గా, చర్చికి వెళ్లారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక కుప్పంకు వెళ్ళి అక్కడ పాదయాత్ర కమిటీలతో లోకేష్ చర్చించనున్నారు. పాదయాత్రని అట్టహాసంగా మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక మొదటి రోజు పాదయాత్రతో పాటు బహిరంగ సభ ఉండనుంది. అయితే లోకేష్ పాదయాత్ర ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళుతుంది..ప్రజలు ఏ విధంగా లోకేష్‌ని ఆదరిస్తారనేది చూడాలి.

అయితే పాదయాత్రలు చేసిన వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. వారికి ప్రజల్లో ఆదరణ లభించింది. ఇక లోకేష్‌కు సైతం ఆదరణ వస్తుందని టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్, చంద్రబాబు, జగన్ లాంటి వారు పాదయాత్ర చేసి తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి చంద్రబాబు ప్లేస్ లో పాదయాత్ర చేస్తున్న లోకేష్ టి‌డి‌పిని అధికారంలోకి తీసుకొస్తారా? లేదా? అనేది చూడాలి.

రాష్ట్రంలో ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాస్త టి‌డి‌పి బలపడుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో లోకేష్ పాదయాత్ర చేయడం టి‌డి‌పికి అడ్వాంటేజ్ అయి, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందేమో చూడాల్సి ఉంది. అలాగే ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదిగేందుకు అవకాశం వస్తుంది. మొత్తానికి పాదయాత్ర టి‌డి‌పికి ప్లస్ అయ్యేలా ఉంది.