మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రవితేజ.. ఈ ఏడాది జనవరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది.
ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ గా రవితేజ అదరగొట్టేశాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తనదైన పర్ఫామెన్స్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లాడు. కథ, కథనం రొటీన్ గానే ఉన్నా.. సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. అయితే వాల్తేరు వీరయ్య ఘనవిజయం వెనుక చిరంజీవి బాక్సాఫీస్ సత్తాతో పాటు రవితేజ సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది.
అదేంటంటే.. రవితేజ పోలీస్ గెటప్ లో కనిపిస్తే చాలా ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. రవితేజకు ఖాకీ డ్రెస్ బాగా కలిసొచ్చింది. ఆయన కెరీర్ లో ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. విక్రమార్కుడు చిత్రంతో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు సరికొత్త నిర్వచనం చెప్పాడు. అలాగే కిక్, పవర్, మిరపకాయ్, క్రాక్ చిత్రాలకు రవితేజ ఖాకీ డ్రెస్ సింటిమెంట్ వర్తించింది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సైతం మంచి విజయం సాధించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.