కేసీఆర్‌కు టచ్‌లో ఏపీ ఎమ్మెల్యేలు..సంక్రాంతి తర్వాత..!

ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చారు. రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి తోట చంద్రశేఖర్..తాజాగా హైదరాబాద్‌కు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

ఇదే క్రమంలో పలువురు కాపు నేతలని చేర్చుకున్న కేసీఆర్..ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించారు.  బీఆర్‌ఎస్‌కు తోడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రావాలని, బీఆర్‌ఎస్‌లో చేరి పని చేసే వారికి ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో దక్కిన గౌరవం దక్కుతుందని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రొటీన్‌ రాజకీయం కాకుండా ప్రజలకు సరైన అభివృద్ధి కోసం మార్పు కావాలని, తెలంగాణ పథకాలు కావాలని అన్ని రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉందని, సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్‌ పరుగులు మొదలవుతాయని చెప్పారు.

BRS : బీఆర్‌ఎస్‌కు ఏపీ ప్రజలు

ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరుతామని ఫోన్లు చేస్తున్నారని, సంక్రాంతి తర్వాత వలసల విపరీతంగా నడుస్తాయని, అదేవిధంగా ఏపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ లో చేరడానికి వారు రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ..లేక టీడీపీ వాళ్ళ అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎలాగో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు..వైసీపీకి 156 మంది ఉన్నారు.

మరి వీరిలో ఎవరు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారో క్లారిటీ లేదు..ఇక ఏపీలో కేసీఆర్..కాపు నేతలపై ఎక్కువ గురి పెట్టారు. కాపు నేతలని చేర్చుకుని..కాపు ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో ఎవరికి ఎసరు పెడతారో చూడాలి.