జగన్‌తో విశాల్..బాబుకు టెన్షన్..కుప్పంపైనే గురి.!

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తమిళ నటుడు విశాల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా తెలుగువాడైన విశాల్..తమిళనాడు వెళ్ళి అక్కడ హీరోగా సెట్ అయిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త జి‌కే రెడ్డి అనే సంగతి తెలిసిందే..వీరిది చిత్తూరు జిల్లా. అలాగే కుప్పంలో అంతకముందు వ్యాపారాలు కూడా చేశారు. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో విశాల్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున కుప్పంలో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

దీనిపై ఒకసారి విశాల్ క్లారిటీ కూడా వచ్చారు. కుప్పంలో పోటీ చేయనని చెప్పారు. అయితే తాజాగా ఆయన నటించిన లాఠీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్తూరుకు వచ్చారు. దీంతో మళ్ళీ ఆయన పోలిటికల్ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. దీంతో మరొకసారి విశాల్ క్లారిటీ ఇస్తూ..తాను కుప్పంలో పోటీ చేయడం లేదని చెప్పారు. కానీ జగన్ ‌అంటే ఇష్టమని, ఐ లవ్ జగన్ అని అన్నారు. ఏపీలో ఓటు ఉంటే ఆయనకే వేసేవాడినని అన్నారు. అలాగే ఆయన..జగన్‌తో భేటీ కానున్నారు.

దీంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయిందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. విశాల్..జగన్‌ని కలిస్తే బాబుకు టెన్షన్ ఎందుకనేది వైసీపీ వర్గాలకే తెలియాలి. అంటే కుప్పంలో అనువణువు  తనకు తెలుసని విశాల్ అన్నారు. పైగా ఇప్పుడు జగన్‌ని కలుస్తున్నారు. దీంతో కుప్పంలో బాబు ఓటమి కోసం విశాల్ తన వంతు సాయం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కుప్పంలో బాబుని దెబ్బతీయడానికి వైసీపీ ఎన్ని ఎత్తులతో ముందుకొచ్చిందో చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు విశాల్ ద్వారా కూడా బాబుకు చెక్ పెట్టాలని చెప్పి చూస్తున్నారని ప్రచారం వస్తుంది. విశాల్ పోటీ చేయకపోయినా వైసీపీకి సపోర్ట్ గా ఉంటూ పరోక్షంగా బాబు ఓటమి కోసం పనిచేస్తారని అంటున్నారు. ఇక ఎవరు ఎలా రాజకీయం చేసిన కుప్పంలో బాబుని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.