కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని బాబు చెప్పారు..గాయపడిన వారికి పూర్తిగా నయం అయ్యేవరకు చికిత్స చేయించడం..వారికి ఆర్ధిక సాయం పెద్ద ఎత్తున ప్రకటించారు.

అటు పి‌ఎం మోదీ సైతం సంతాపం తెలియజేసి ఆర్ధిక సాయం అందించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం జగన్ సైతం ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే కందుకూరు ఘటనపై వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే..చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చతో ఇరుకు రోడ్డులో సభ పెట్టడం వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు.అలా విమర్శించే వారి అజ్ఞానానికే వదిలేస్తానని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అదే రోడ్డులో జగన్ సభ పెట్టిన విషయం మరిచిపోయారని, జనం ఎక్కువ రావడం, పూర్తి స్థాయిలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడం, తోపులాట వల్ల దురదృష్ట ఘటన జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

ఇక రోజంతా మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన బాబు..గురువారం సాయంత్రం కావలి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ సభా వేదికగా సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నారని, ఎమ్మెల్యేలని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో కావలి సీటు గెలవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేకు నెగిటివ్ కనిపిస్తోంది..కానీ టీడీపీ ఇంకా బలపడాలి. టీడీపీ ఇంచార్జ్  మాలేపాటి సుబ్బానాయుడు అనుకున్న స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు.మరి ఎన్నికల సమయంలో ఇక్కడ మరో అభ్యర్ధిని పెడతారేమో చూడాలి.