ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి. జిల్లాలో 19 సీట్లు ఉంటే అందులో ఐదారు సీట్లలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్న తునిలో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా యనమల తుని నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి..దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు.
ఇలా వరుసగా ఓడిపోయిన టీడీపీ పరిస్తితి ఇంకా దారుణంగానే ఉంది. యనమల ఫ్యామిలీ పెద్దగా తునిలో పార్టీని బలోపేతం చేయలేదు. పైగా యనమల ఫ్యామిలీపై ప్రజల్లో నెగిటివ్ ఉంది. ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే నెగిటివ్ కనిపిస్తోంది. యనమల ఫ్యామిలీ ఒంటెద్దు పోకడలే. ఇక్కడ టీడీపీకి పెద్ద మైనస్. మళ్ళీ గాని యనమల ఫ్యామిలీకి సీటు ఇస్తే తునిలో టీడీపీ మళ్ళీ ఓడిపోవడం ఖాయమని సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు.
ఈ సారి యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వొద్దని సొంత కార్యకర్తలే చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు..తుని నియోజకవర్గంపై గట్టిగానే ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇక్కడ అభ్యర్ధిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు..చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో తుని సీటు అశోక్ బాబుకు ఇస్తున్నారని ప్రచారం మొదలైంది.
క్షత్రియ వర్గానికి చెందిన అశోక్ బాబుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి యనమలని ఓడించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి..యనమల ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనని తుని నుంచి బరిలో దింపే యోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తునిలో యనమల ఫ్యామిలీకి షాక్ ఇచ్చే నిర్ణయం వస్తుందని తెలుస్తోంది.