టీడీపీ ‘ఘర్‌వాపస్’..ఆ నాయకులతో టచ్‌లోకి!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘర్‌వాపస్ కార్యక్రమం చేపట్టింది. 2018 ఎన్నికల తర్వాత టీడీపీలో మిగిలిన వారు కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఆ పార్టీలో తక్కువ మంది నేతలు మాత్రమే మిగిలారు. అయితే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టారు. ఇటీవల ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు. ఆ సభ వేదికగానే..ఇతర పార్టీల్లోకి వెళ్ళిన మాజీ తమ్ముళ్లని మళ్ళీ తిరిగి రావాలని చెప్పి చందబాబు పిలుపునిచ్చారు. ఈ సభ తర్వాత తెలంగాణలో టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అయ్యాయి. ఇదే ఊపుని కొనసాగించాలని చెప్పి కాసాని చూస్తున్నారు.

అందుకే ఖమ్మం తర్వాత మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో కూడా భారీ సభలు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల్లోకి వెళ్ళి పెద్దగా ప్రాధాన్యత దక్కని మాజీ టీడీపీ నాయకులపై పార్టీ ఫోకస్ పెట్టింది. వారిని మళ్ళీ టీడీపీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో పలువురు నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అటు జిల్లాలో పార్టీకి క్యాడర్‌ కొంతమేర ఉండడం వల్ల పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీలో గతంలో ఉన్న వారిని ఘర్‌ వాపస్‌ పేరిట చేర్చుకోవడంతో పాటు కొత్తవారిని ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ముఖ్యంగా బోధన్‌, బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని అనుకూలిస్తే జనవరి చివరి వారంలో నిజామాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును తీసుకురావడంతో పాటు ఇతర నేతలను ఆహ్వానించి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడే దిశగా టీడీపీ ముందుకెళుతుంది.