కర్నూలు జిల్లాలో కర్నూలు సిటీ నియోజకవర్గం అంటేనే రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉన్న స్థానం. ఇక్కడ సమయం బట్టి ఒకో పార్టీని ప్రజలు ఆదరిస్తారు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే నడుస్తూ వచ్చింది. కానీ 1983లో టీడీపీ ఇక్కడ సత్తా చాటింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకే వెళ్లింది. 1994లో మాత్రం కమ్యూనిస్టులు గెలిచారు. ఇక 1999లో మరొకసారి టీడీపీ గెలిచింది. 2004లో సిపిఎం సత్తా చాటింది.
2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది. అలా అని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించలేదు. 2014లో 3479 ఓట్లు, 2019 ఎన్నికల్లో 5353 ఓట్ల తేడాతో గెలిచింది. అంటే రెండుసార్లు మెజారిటీ తక్కువే. మరి ఈ సారి కర్నూలులో రాజకీయం మారేలా ఉంది. వాస్తవానికి ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తున్న..గ్రూపు తగాదాలు ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి వర్గం హవా ఎక్కువ. పైగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు వ్యతిరేకంగా ఉంది. అటు ఎస్వీ మోహన్ రెడ్డి సైతం ఈ సారి సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇక వీరిలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు.
ఈ పరిణామాలు టీడీపీకి ప్లస్ అవుతున్నాయి..పైగా మొన్నటివరకు యాక్టివ్ గా లేని టీజీ భరత్..ఇప్పుడు దూకుడుగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఆయనపై ఉంది. అటు పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ క్షేత్ర స్థాయిలో బలపడుతున్నారు. అలా అని కర్నూలులో వైసీపీ బలం తగ్గిందని అనుకోవడానికి లేదు. ఆ పార్టీకి బలం ఎక్కువే ఉంది. కాకపోతే టీడీపీ గట్టిగా కష్టపడితే..గెలవడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే భరత్ నిలకడగా పనిచేస్తే గెలుపు ఈజీ అవుతుంది. ఇక టీడీపీ టికెట్ సైతం భరత్కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి చూడాలి ఈ సారి కర్నూలు సిటీ ఎవరికి దక్కుతుందో.