జనసేనతో పొత్తు..తెనాలి సీటు నాదెండ్లకే..ఆలపాటి క్లారిటీ.!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై కొంతమంది తెలుగు తమ్ముళ్ళకు నిదానంగా క్లారిటీ వస్తుంది. పొత్తు ఉంటేనే గట్టెక్కుతామనే భావన..అటు టీడీపీలోగానీ, ఇటు జనసేనలో గాని ఉందని చెప్పవచ్చు. పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లబ్ది జరిగేలా ఉంది. అందుకే పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అంటున్నారు. ఇటు చంద్రబాబు కలిసి పనిచేద్దామని అంటున్నారు.

మొత్తానికి అధికారికంగా పొత్తు విషయం క్లారిటీ లేదు గాని..అనధికారంగా చంద్రబాబు-పవన్ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. ఈ విషయంపై టీడీపీలో కొందరు నేతలకు క్లారిటీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పొత్తు ఉంటే కొన్ని సీట్లని జనసేన కోసం టీడీపీ త్యాగం చేయాలి. అలా జనసేనకు ఇచ్చే సీట్లలో కొందరు టీడీపీ నేతలు పొత్తుపై క్లారిటీ గా ఉన్నారు.

ఇదే సమయంలో తన సీటు విషయం చంద్రబాబు చూసుకుంటారని..మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది. ఇక్కడ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అంటే అప్పుడు ఆలపాటి సీటు త్యాగం చేయాలి. దీనిపై ఆలపాటి ఫుల్ క్లారిటీతో ఉన్నారు.  తెనాలి సీటు తనకేమీ రాసిపెట్టి లేదని మొదట్లో వేమూరులో, తర్వాత తెనాలిలో పోటీ చేశానని, ఒక సీటు అని తనకు రాసిపెట్టి లేదని, తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు ఏ స్థానంలో పోటీ చేయమంటే అక్కడ తాను పోటీ చేస్తానని ఆలపాటి రాజా స్పష్టం చేశారు.

పొత్తుల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, తన రాజకీయ భవితవ్యం కూడా చంద్రబాబే చూసుకుంటారని అన్నారు. అంటే తెనాలి సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తున్నారని, ఆలపాటి రాజా సీటు త్యాగం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి పొత్తుపై ఆలపాటి క్లారిటీ ఇచ్చారు.