బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 విన్నర్ ఎవరో నిన్నటితో తేలిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆటలో రేవంత్ గెలిచాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం చూసుకుంటే ఈ షోలో రియల్ విన్నర్ శ్రీహాన్ అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించడం విశేషం. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, బిగ్ బాస్ అభిమానుల ఆలోచనలకు భిన్నంగా ఓటింగ్ జరిగిందని నాగ్ చెప్పకనే చెప్పేశారు.
ఇదే మాదిరి గత సీజన్లలో కూడా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఓటింగ్ జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటకు రాకుండా వున్నట్లైతే మాత్రం నాగార్జున బిగ్ బాస్ విజేతగా శ్రీహాన్ ను ప్రకటించేవారు. బిగ్ బాస్ సీజన్3 సమయంలో అందరూ శ్రీముఖి విజేత అవుతారని అనుకుంటే రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇకపోతే శ్రీహాన్ బిగ్ బాస్6 రన్నర్ గా నిలిచినా ప్రేక్షకుల హృదయాన్ని మాత్రం గెలుచుకున్నారు అని చెప్పకతప్పదు.
మరోవైపు శ్రీహాన్ కు భారీ స్థాయిలో ఓట్లు రావడం వెనుక సిరి హస్తం ఉందనే గుసగుసలు వినబడుతున్నాయి. సిరి హన్మంత్ ఎంతో కష్టపడి ఓట్లు వేయించడం వల్లనే శ్రీహాన్ కు రేవంత్ కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయని ఓ వర్గం చెబుతోంది. ఏదిఏమైనా బిగ్ బాస్ షో వల్ల శ్రీహాన్ పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరిగింది అనేది వాస్తవం. ఈ క్రమంలో శ్రీహాన్ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే మొన్నటికి మొన్న హౌస్ నుండి బయటకి వచ్చిన ఆదిరెడ్డి అభిమానులు మాత్రం పెయిడ్ బ్యాచ్ వల్ల ఆదిరెడ్డి విన్నర్ కాలేదని వాపోతున్నారు.