ఏపీలో కొత్త పంచాయితీ..కాపు వర్సెస్ బలిజ.!

ఏపీలో కులాల పంచాయితీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది..కులాల ఆధారంగానే రాజకీయాలు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు బీసీల కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాపులపై గురి పెట్టారు. కాపు ఓట్లు లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్ధంతినీ రెండు పార్టీలు కాపు ఓట్లు కొల్లగొట్టే వేదికలుగా మార్చుకున్నాయి. అటు విశాఖలో కాపు నాడు జరిగింది. దీనికి వైసీపీ మినహా అన్నీ పార్టీలు హాజరయ్యాయి.

అలాగే కాపులకు సీఎం పదవి అనే కాన్సెప్ట్ తో కాపు నేతలు ముందుకెళుతున్నారు. ముఖ్యంగా పవన్ కోసం కాపు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా కాపు నేతల రాజకీయంతో..అదే కేటగిరీలో ఉండే బలిజ వర్గం తెరపైకి వచ్చింది. కాపులు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి, తెలగ ఇలా ఇంకా కొన్ని కులాలు కలిపి ఒకే తెగకు కిందకు వస్తాయి. అయితే ఇందులో కాపుల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే అంశం బలిజ వర్గానికి ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తోంది. రాయలసీమలో అధికంగా ఉండే బలిజలకు ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారని, ఆ వర్గం నేతలు ఆవేదన చెందుతున్నారు.

కాపులు 28 శాతం ఉన్నారని, ఎన్నికల ముందు జరిగే తంతు ఇప్పుడు మళ్లీ జరుగుతోందని 14 శాతం ఉన్న బలిజలను ఎవ్వరూ గుర్తించడం లేదని,  కాపు నేతల నాయకత్వంలో మేము పనిచేసినా.. మా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని, ఎన్టీఆర్ బలిజలను గుర్తించారని,  వైఎస్సార్ కాపులను గుర్తించారని, ఇన్నాళ్లు మమ్మల్ని గుర్తిస్తారని ఆగామని, కానీ.. అది జరగడం లేదని,  రంగాపైనా మాకు అభిమానం ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ రమణ చెప్పుకొచ్చారు. కాపు, బలిజ కలిస్తేనే బలమని అన్నారు.

ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ, కాపు నేత తోట త్రిమూర్తులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఉన్న బలిజలను తాము ఎప్పుడూ తక్కువ చేయలేదని, వారు, మేము ఒకటే అని అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని కాపులు అందరూ ఒకటే అని చెప్పుకొచ్చారు.  మొత్తానికి ఎలా వచ్చిందో గాని..కాపులు, బలిజల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం క్రీడ మొదలుపెట్టారు.