`ఇడియట్ 2`తో త‌న‌యుడి ఎంట్రీ.. ఫైన‌ల్ గా ఓపెన్ అయిపోయిన‌ ర‌వితేజ‌!

`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చ‌క్కర్లు కొడుతోంది.

ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న రవితేజ తాజాగా `వాల్తేరు వీరయ్య` ప్రమోషన్స్ లో భాగమయ్యారు. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవితో పాటు ర‌వితేజ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా `మీ అబ్బాయి ఇడియట్ 2 సినిమాతో లాంచ్ చేస్తున్నారని టాక్ న‌డుస్తోంది.. మీరు ఏమంటారు..?` అని ర‌వితేజ‌ను ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు.

అందుకు `అటువంటిది ఏమీ లేదండీ! విన‌డానికే ఇది నాకు చాలా కొత్తగా ఉంది` అని ర‌వితేజ సమాధానం ఇచ్చారు. `రవి గారి అబ్బాయి చాలా చిన్నోడు` అని నిర్మాత వై. రవి శంకర్ చెప్పారు. మొత్తానికి నెట్టింట‌ చక్కర్లు కొడుతున్న వార్త పుకారే అని తేలిపోయింది. కాగా, మహాధన్ ఇప్ప‌టికే వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్య‌డు. రవితేజ `రాజా ది గ్రేట్` సినిమాలో అతడు బాల న‌టుడిగా నటించాడు. మ‌రి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.