కందుకూరు ఘటన..టీడీపీకి విషాదమే.!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు కార్యక్రమం చేస్తూ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరంల్లో బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు..అలాగే ఎలాంటి విషాద ఘటనలు జరగకుండా పర్యటనలు సక్సెస్ అయ్యాయి. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు రోడ్ షోలో ఊహించని ఘటన జరిగింది.

బాబు రోడ్ షోకు భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో కందుకూరు సెంటర్ జనంతో నిండిపోయింది. అప్పుడే బాబు ఎంట్రీ ఇచ్చి..కిక్కిరిసిపోయిన జనాలని చూసి..కొందరిని వరించారు..కొందరు ప్లేస్ లేక వాహనాలు మీదకు ఎక్కారు..మరి కొందరు ఫ్లెక్సీలపైకి ఎక్కారు. దీంతో బాబు స్పీచ్ మొదలుపెట్టకుండా వారిని వారించారు. అందరూ దిగిపోవాలని సూచించారు. చాలాసేపటికి వారు దిగిపోయారు. ఈలోపు బాబు స్పీచ్ మొదలుపెడుతుండగా ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది.

No photo description available.

జనం భారీగా ఉండటంతో..పక్కనే డ్రైనేజ్ కాల్వ గోడలపై కొందరు కార్యకర్తలు ఎక్కారు. అదే సమయంలో తోపులాట జరిగింది..దీంతో ఊహించని విధంగా కొందరు కార్యకర్తలు డ్రైనేజ్ కాల్వలో పడిపోయారు. మొత్తం చీకటి కావడం, మురుగు నీరు తాగడంతో ఊపిరి ఆడక కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో బాబు స్పీచ్ ఆపేసి..వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లి..నాయకులు వారిని చూసుకోవాలని కోరారు.

కాసేపటికి బాబు కూడా హాస్పటల్‌కు వెళ్లారు. అయితే అప్పటికే కొంతమంది చనిపోయి ఉన్నారని తెలిసి..బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో 8 మంది చనిపోగా, 6 గురు వరకు గాయపడ్డారు. దీంతో బాబు మళ్ళీ వేదిక దగ్గరకు వచ్చి చనిపోయిన వారికి సంతాపం ప్రకటించి..ఒక్కోక్కరికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ విషాద ఘటనతో బాబు సభని రద్దు చేసుకున్నారు. అయితే ఇలా కార్యకర్తలు చనిపోవడంతో టీడీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.