ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇతర రాష్ట్రాలమాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసలు ఏపీని బీజేపీ పట్టించుకుంటుందా? లేక వదిలేసినట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తన కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించ డం ద్వారా బలమైన హిందూ వాదాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే గోవా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్(తాజాగా ఓడింది), కర్ణాటక, ఒడిసా(ఇక్కడ ఇప్పుడు బాగానే ఉంది), యూపీ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. అంతేకాదు.. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకలో ఇప్పటికే అధికారంలో ఉంది. తెలంగాణలో పాగావేయాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్ని ఉపాయాలు.. ఉంటే అన్నిటినీ ఇక్కడ ప్రయోగించాలని చూస్తోంది. ప్రయోగిస్తోంది కూడా. అయితే, ఇంత చేస్తున్న బీజేపీ.. ఏపీ విషయంలో మాత్రం సైలెంట్‌గా మారిపోయింది.
మరి దీనికి రీజన్ ఏంటి? ఎందుకు ఏపీని వదిలేసింది? అనేది చర్చకుదారితీస్తోంది. ఎందుకంటే.. టీడీపీ బలంగా ఉండడమే కారణమని భావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఉండగా.. ఇక్కడ బీజేపీ ఎదిగే పరిస్థితి లేదు. అదేసమయంలో తాము ఇక్కడ విస్తరిస్తే.. అది టీడీపీకి మేలు చేస్తుందనే భావనను కమల నాథులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ సారి ఎన్నికల్లో మరోసారి వైసీపీకి అవకాశం ఇచ్చేసి.. తర్వాత వచ్చే ఎన్నికల్లో పుంజుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు.
దీనివల్ల రెండు రకాలుగా మేలు జరుగుతుందని కమల నాథులు ఊహిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి.. టీడీపీ 2029 నాటికి పుంజుకునే పరిస్థితి ఉండదని.. అదేసమయంలో వైసీపీ అధినేత పై ఉన్న కేసులు కూడా వచ్చే ఐదేళ్లలో ఒక కొలిక్కి వస్తాయని.. సో.. అప్పుడు తాము రంగంలోకి దిగితే.. ఈ రెండు పార్టీల నుంచి వచ్చేవారితో తమ పార్టీని నింపుకొని.. అప్పులు హవా చెలాయించేలా వ్యూహంతో ఉందని చెబుతున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల్లో పుంజుకున్నట్టుగా ఏపీలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదని అంటున్నారు.