బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి.

ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని కలిసిన విషయం తెలిసిందే. అయితే విశాఖలో పవన్‌ని వైసీపీ ప్రభుత్వం నిలువరించడంతో..బాబు వెళ్ళి పవన్‌కు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఇక పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఊహించని కలయిక చోటు చేసుకుంది. తాజాగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కలిశారు.

వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ ఫ్యాన్స్ రచ్చ

అయితే సినిమా షూటింగ్‌ల్లో వీరు కలిశారు. అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య వీరసింహారెడ్డి పాట షూటింగ్ జరుగుతుండగా, ఇటు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే పవన్..బాలయ్య షూటింగ్‌కు వెళ్ళి కలిశారు. ఇక వారు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారు జనరల్‌గానే కలిసినట్లు తెలుస్తోంది. కానీ వారు రాజకీయ పరమైన చర్చ కూడా చేశారని టాక్ వస్తుంది.

అదేవిధంగా బాలయ్య చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్ షోకు పవన్ సైతం వస్తున్నారని సంగతి తెలిసిందే. అయితే బాలయ్య-పవన్ కాంబినేషన్ కనిపించడం అనేది చాలా అరుదు..కానీ ఆ  అరుదైన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. ఇది పోలిటికల్ పరంగా టీడీపీ-జనసేన కలవడానికి కూడా పనికొస్తుందని విశ్లేషకులు అంటున్నారు.