జగన్ ఎన్నికలకు వెళ్ళేది అప్పుడే..మార్చిలో సీట్లు..!

ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్..సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా మార్చి వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, ఆ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని..ఆ తర్వాత సీట్లని సైతం ఫిక్స్ చేస్తానని చెప్పారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్తితుల్లోనూ సీట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వడానికి చూస్తానని, లేని పక్షంలోనే కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు.

అయితే వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు విషయంలో భయం ఉంది. కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కేలా లేదు. ఈ విషయం పక్కన పెడితే…మార్చి తర్వాత సీట్లు ఫిక్స్ చేస్తానని జగన్ చెప్పడంతో..ఎన్నికలు ఏమైనా ముందు జరగనున్నాయనే అనుమానాలు కూడా వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. కానీ జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని, అందుకే జగన్ ముందస్తుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

బాబు వ్యాఖ్యలని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పూర్తి కాలం పాలించమని ప్రజలు అవకాశం ఇచ్చారని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరి మాట నమ్మాలో అర్ధం అవ్వని పరిస్తితి. ఇదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు కూడా జరుగుతాయని అన్నారు. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి గెలిచిన విషయం తెలిసిందే. మళ్ళీ ఆయన ఇంకోసారి ముందస్తుకు వెళ్తారని ప్రచారం ఉంది. అలా జరగకపోతే షెడ్యూల్ ప్రకారం..2023 డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే ఏపీలో ఎన్నికలు జరిగేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం లేదని, అందుకే ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. మరి చూడాలి జగన్ ముందస్తుకు వెళ్తారో లేదో.