తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో సర్కారుపై ప్రకటించిన `ఇప్పటం యుద్ధం` పార్టీకి ఏమేరకు మైలేజీ ఇచ్చింది. ఆయన అనుకున్నట్టుగా పార్టీకి ఎంత ప్రయోజనంగా మారింది..? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ఘటనలలోనూ పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకటి గత నెలలలో జరిగిన విశాఖపట్నం ఎయిర్పోర్టు ఘటన. ఈ ఘటనలో పార్టీ నేతలు.. మంత్రులపై దాడి చేశారనే వాదనుంది. ఈ క్రమంలోనేవారిపై కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే.. ఈ విషయంలో వెంటనే స్పందించిన పవన్ .. వెంటనే వారిని విడిపించే చర్యలు చేపట్టి.. బెయిల్ ఇప్పించారు. ఇది పార్టీకి మైలేజీ వచ్చేలా చేసింది. ఇంటర్నల్గా పార్టీ బలోపేతం అయ్యేందుకు కూడా ఇది దోహద పడింది. అంతేకాదు.. పార్టీ తరఫున ఏం జరిగినా పవన్ అండగా ఉన్నారనే సంకేతాలను బలంగా పంపించారు. ఇది పార్టీకి మైలేజీ తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. అయితే, తాజాగా ఇప్పటం వ్యవహారాన్ని చూస్తే.. ఒకింత రివర్స్ అయిందనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏం చేయాలని అనుకుంటోంది? నిజంగానే ప్రజలను రోడ్డున పడేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కేవలం పవన్ సభలకు.. భూములు ఇచ్చారనే కక్షతోనే.. రైతులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాన్ని ముందు పవన్ తెలుసుకుని ఉంటే బాగుండేదని.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోకుండా.. కొంత ఆవేశంగా వ్యవహరించారని పరిశీలకులు చెబుతున్నారు.
అంతేకాదు.. చివరి నిముషంలో కారుపై ఎక్కి.. కూర్చిని విమానాశ్రయానికి వెళ్లడం వంటివి కూడా ఆయనపై ఇప్పటి వరకు మేధావుల్లో ఇమేజ్ను తగ్గించాయనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన సంయమనం పాటించాలి. పైగా విషయం తెలుసుకుని ప్రభుత్వంపై పోరాటం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక, రాజకీయంగా చూస్తే.. దీనిపై భిన్నమైన అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల ఇళ్లు కూల్చేశారని..అప్పుడు ఎందుకు స్పందించలేదని.. ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. సో.. మొత్తంగా చూసుకుంటే..జనసేనకు ఈ ఇప్పటం ఘటన రాజకీయంగా కలిసి రాలేదని అంటున్నారు.