తాజాగా దేశ వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో 6 నియో జకవర్గాల్లో అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అదేవిధంగా యూపీ, బీహార్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో జరిగిన ఉప పోరులోనూ.. అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీకే పగ్గాలు అప్పగించారు.
ఈ పరిణామాలు గమనించిన తర్వాత.. ఏపీలో పరిస్థితి ఏంటి? అనే చర్చ తెరమీదికి వచ్చింది. పలు రాజకీయ పార్టీలు.. ఇదే విషయాన్ని చర్చిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలు పుంజుకున్నామని.. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అధికార పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏపీలోనూ అధికార పార్టీకే ప్రజలు పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
కొన్నాళ్లుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, రెడీగా ఉండాలని తన పార్టీ శ్రేణులను ఆయన సూచనలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు దేశంలో వచ్చిన రిజల్ట్ గమనించిన తర్వాత..ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. అది అధికార పార్టీకి మేలు చేసే అవకాశం ఉందనే అంచనాలు వచ్చాయి. మరోవైపు.. అధికార పార్టీలకే ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తున్న దరిమిలా ఏపీలో విపక్షాలు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మేధావులు చెబుతున్న మాట.
అంతేకాదు, ఇంకా వచ్చే ఎన్నికలకు సమయం చాలానే ఉన్నందున అధికార పార్టీపై పైచేయి సాధించేం దుకు ఉన్న వ్యూహాలపై దృష్టి పెట్టడం మంచిదనే సూచనలువస్తున్నాయి. ఏదేమైనా.. ప్రజల మూడ్ మాత్రం ఇప్పుడు అధికార పార్టీ వైపే ఉండడం.. ఎన్నికల్లో ఆయా పార్టీలకే మొగ్గు చూపుతుండడాన్ని బట్టి.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరుగుతుందనేది చూడాలి.