`నువ్వే నువ్వే` రీ-రిలీజ్‌.. త్రివిక్ర‌మ్ పేరు చెబితే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి వ‌స్తారా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ లు మరియు స్పెషల్ షోలా ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలను అలాగే క్లాసిక్స్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తున్నారు. అయితే అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఏ రీ-రిలీజ్ ట్రెండ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత మూడు నెలల్లో తెలుగులో అనేక సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా `పోకిరి` సినిమాను రీ-రిలీజ్ చేయడంతో మొదలైన ట్రెండ్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.

అయితే ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలనే రీ-రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అతడు డైరెక్ట్ చేసిన సినిమాను రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్డే కావడంతో స్రవంతి మూవీస్ వారు `నువ్వే నువ్వే` సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేస్తున్నారని సమాచారం. అయితే నవంబర్ 4 నుండి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన కొన్ని థియేటర్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

నిర్మాత స్రవంతి రవి కిషోర్ మరియు త్రివిక్రమ్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహానుబంధం ముడిపడి ఉంది. అంతేకాకుండా త్రివిక్రమ్ సక్సెస్ లో స్రవంతి మూవీస్ చాలా ప్రముఖ పాత్ర పోషించింది. `నువ్వే కావాలి` సినిమాతో రైటర్ గా త్రివిక్రమ్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన ఆ సంస్థే `నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తరుణ్ మరియు శ్రియ హీరో హీరోయిన్గా తెరకెక్కిన `నువ్వే నువ్వే` సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే హైదరాబాద్లో స్పెషల్ షో వేశారు.

ఇప్పుడు త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్ గా `నువ్వే నువ్వే` సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తన రెండు దశాబ్దాల సినీ కెరీర్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను తీశారు. అయితే ఎన్ని సినిమాలు చేసిన మొట్టమొదటి సినిమా ఎప్పటికీ స్పెషల్ గా ఉంటుంది కనుక `నువ్వే నువ్వే` సినిమాని మళ్లీ విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా అతని దర్శకత్వ ప్రతిభ ఏంటో మొదటిసారిగా చాటి చెప్పిన సినిమా `నువ్వే నువ్వే`. కాబట్టి ఈ సినిమాల్లో స్టార్ హీరోలెవరు లేకపోయినప్పటికీ కూడా.. కేవలం త్రివిక్రమ్ పేరే జనాలను థియేటర్లకు రప్పిస్తుంది.

Share post:

Latest