పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. అయితే అభిమానులని ఈ టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పుకోవాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది యానిమేటెడ్ నా లేదంటే నార్మల్ మూవీనా అనే అనుమానం కలిగింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ తరహా పాత్రలు ఎక్కడా కనిపించకపోవడం కొసమెరుపు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభాస్ రాముడి గెటప్, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముడిని భారతీయులు భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. అలాంటి చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. కానీ డైరెక్టర్ ఓం రౌత్ హిందువుల అంచనాలకు తగ్గట్లుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఓం రౌత్ తెరకెక్కిస్తోంది రామాయణమేనా అనే అనుమానం కలగక మానదు.
టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని నెటిజన్లు అంటున్నారు. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ అయితే దారుణంగా ఉంది. మన ఊహల్లో ఉండే రావణుడు వేరు.. ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేజిఎఫ్ నటి మాళవిక అవినాష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు చేశారు. రావణుడు శివ భక్తుడు, లంకలో ఉంటాడు.. అతనికి 64 కళల్లో ప్రావీణ్యం ఉంది. కానీ మన చరిత్రని, రామాయణాన్ని బాలీవుడ్ దర్శకులు వక్రీకరిస్తున్నారు. రామాయణాన్ని ఇలా వక్రీకరించడం ఆపండి. రామాయణం చదవలేదా ? కనీసం ఎన్టీఆర్ పోషించిన పాత్రలని కూడా చూడలేదా అని మాళవిక అవినాష్ ఓం రౌత్ పై దుమ్మెత్తి పోశారు.