కాంతార షూటింగ్‌లో నటీనటులను ఓ రహస్యశక్తి కాపాడిందా.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!

కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన కాంతార సినిమా అక్కడే కాకుండా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి.. ‘వావ్, సూపర్‌గా తీశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పూణకాలు తెప్పించిందని పొగుడుతున్నారు. అయితే ఈ సినిమాలో చివరి 20 నిముషాలు చూస్తే హీరోలోకి ఏదైనా దైవశక్తి ఆవహించిందా? అలా నటించాడేంటి? అని సగటు ప్రేక్షకుడు అనుకోకుండా ఉండలేడు. ఇదే విషయమై తాజాగా కొన్ని ప్రశ్నలు వేయగా ఈ మూవీ హీరో రిషబ్‌ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“నాకు దేవుడిని ప్రార్థించడం లేదా మరే ఇతర విషయాల గురించి కొంచెం కూడా ఐడియా లేదు. నిజానికి కాంతార మూవీ క్లైమాక్స్‌లో నేనేం చేశానో నాకే తెలియదు. ఆ సమయంలో అలా యాక్ట్ చేసాను, అంతే” అని చెప్పుకొచ్చాడు. దేవుడు గురించి తనకు పెద్దగా తెలియదని అంటూనే అతడు మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా షూటింగ్ మొదలు నుంచి చివరాకరి వరకు, ఏదో ఒక అదృశ్య శక్తి తమ మూవీ సిబ్బందినంతా రక్షించిందంటూ అతడు పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేస్తున్నప్పుడు మూవీ యూనిట్ అంతా ఒక అడవిలాంటి ప్రదేశంలో ఉన్నారని కానీ వారికి ఏ చిన్న సమస్య కూడా రాలేదని అన్నాడు.

ఈ సినిమా షూటింగ్ జరిపేటప్పుడు చాలా రోజులపాటు అడవి ప్రదేశంలోనే తాము ఉన్నట్లు తెలిపాడు. అర్ధరాత్రి అయ్యేసరికి అందరిలో భయమేసేదని కానీ తమకు ఎలాంటి ఆపద రాలేదన్నారు. తాము షూటింగ్ తీసిన ప్రదేశం అడవిలో ఒక భాగమని.. అక్కడ పాములు, ఇతర జీవుల యథేచ్ఛగా తిరుగుతాయన్నారు. కానీ తమకు మాత్రం అవేమీ ఎదురు పడలేదని.. ఈ సమయం అంతా ఏదో శక్తి తమని రక్షించేదని అన్నారు. తనను దేవుడు పిలవనప్పటికీ, దైవ శక్తి తన శరీరంలోకి వెళ్ళనప్పటికీ.. ఏదో ఒక రహస్యమైన శక్తి తనను, తన మూవీ టీమ్‌ను రక్షించిందని అతను వెల్లడించాడు. కాగా అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.