రాజుగారి సర్వే…అక్కడే తేలిపోయింది..?

ఈ మధ్య ఏపీలో సర్వేల గోల ఎక్కువైపోయింది..లోకల్ నుంచి నేషనల్ సంస్థల వరకు సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్నీ సర్వేల్లో…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి. అలాగే గతం కంటే వైసీపీ బలం కాస్త తగ్గిందని, టీడీపీ బలం కాస్త పెరిగిందని అంటున్నాయి…కాకపోతే వైసీపీకే ఆధిక్యం ఉంటుందని చెబుతున్నాయి.

ఇటీవల వచ్చిన ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేల్లో కూడా వైసీపీ హవా ఉందని తేలింది. అయితే ఇవన్నీ కరెక్ట్ కాదని, తాను చేయించిన సర్వే కరెక్ట్ అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. గత జూన్-జూలై నెలల్లో తాను సర్వే చేయించాను అని చెప్పి….ఓ రిపోర్టుని వదిలారు. ఆ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

అలాగే టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 90 అని, ఇక వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 7 నుంచి 8 అని, ఇంకో మూడు నుంచి నాలుగు స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. అలాగే టఫ్ ఫైట్ జరిగే స్థానాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీకి 127 సీట్లు వరకు వస్తాయని, లేదంటే వైసీపీ ఎక్కువ గెలిస్తే 73 సీట్ల వరకు వస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువ ఉందని, ఒకవేళ టీడీపీతో జనసేన కలిస్తే టఫ్ ఫైట్ ఉన్న సీట్లని వన్ సైడ్ గా గెలుచుకుంటాయని చెప్పారు.

ఓవరాల్ గా చూస్తే టీడీపీనే గెలుస్తుందని రాజుగారి సర్వే చెబుతుంది. అయితే ఈ సర్వేలో ఎంత నిజముందో జనాలకే తెలుసు. ఇంకా చెప్పాలంటే కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాల్లో టీడీపీనే ఎక్కువ సీట్లు సాధిస్తుందని చెప్పడం విడ్డూరంగానే ఉంది. అసలు అవి కాదు…వైసీపీ గెలుపుకు ఢోకా లేని చంద్రగిరి, పాణ్యం స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పడమే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి రాజుగారి సర్వే మరీ నమ్మశక్యంగా లేదని చెప్పొచ్చు.