పూరీ జగన్నాథ్.. అంటే ఎవరో తెలియని సినిమా ప్రేక్షకుడు ఇండియాలోనే ఉండడు. ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి పెరిగిన పూరి నేడు తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరుకున్నాడు అంటే మామ్మూలు విషయం కాదు. ఈయన సినిమాలలో ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. హీరోయిజాన్ని చూపించడంలో పూరీని మించిన దర్శకుడు ఇండియాలోనే లేదని చెప్పుకోవాలి. అలాగే ఈయన పరిచయం చేసిన చాలా మంది భామలు ఇండస్ట్రీని ఒక యేలు ఏలారని చెప్పుకోవాలి.
తాజాగా ఈయన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ‘లైగర్’ మూవీతో అనన్య పాండే పరిచయమైన సంగతి విదితమే. ఇక పూరి గతాన్ని ఒకసారి తొంగి చూస్తే… ప్రతి సినిమాకి ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేసిన వైనం కనబడుతుంది. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ను హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ‘బద్రి’ సినిమాతో అమీషా పటేల్‌ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసారు పూరీ జగన్నాథ్.
అలాగే ‘బాచి’ మూవీతో నీలాంబరి, రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాతో తనూ రాయ్, ‘ఇడియట్’ మూవీతో రక్షిత, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంతో అసిన్… ఇలా ఆయన చేసిన ప్రతి సినిమాకి ఓ సరికొత్త తారలను తెలుగు వెండితెరకు పరిచయం చేసేవారు. ఇక దాని తరువాత వచ్చిన సినిమా ‘143’ మూవీతో సమీక్ష అనే కథానాయికను పరిచయం చేసాడు. అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో అనుష్క శెట్టి, అయేషా టకియా, ‘దేశ ముదురు’ సినిమాతో హన్సిక, చిరుత సినిమాతో నేహా శర్మను కథానాయికగా పరిచయం చేసారు. దీని తరువాత ‘ఏక్ నిరంజన్’ సినిమాతో కంగనా రనౌత్, ‘నేనింతే ’సినిమాతో సియా గౌతమ్, ‘హార్ట్ ఎటాక్’ మూవీతో అదాశర్మ, ‘లోఫర్’ మూవీతో దిశా పటానీ, ’ఇజం’ మూవీతో అదితి ఆర్య, ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఏంజెలా క్రిస్లెంజీ, ‘పైసా వసూల్’ మూవీలో ముస్కాన్ సేథి, ‘మెహబూబా’ సినిమాతో నేహా శెట్టి, చివరగా ‘లైగర్’మూవీతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అయింది.