అంతుప‌ట్ట‌ని ప‌వ‌న్ రాజ‌కీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడు పెంచారు. వ‌రుస‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను ప‌రామ‌ర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త మూడేళ్ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు ప‌వ‌న్ దూకుడు పెంచ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు.

దీనికి కార‌ణం.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డ‌మేనా? లేక మ‌రేదైనా వ్యూహం ఉందా? అనేది చ‌ర్చ‌గా మారింది. ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ప్ర‌కారం.. వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తోంది. వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేస్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు కూడా ప్ర‌భుత్వ తీరును ప‌లు సంద‌ర్భాల్లో ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. ఇక‌, ఇత‌ర నాయ‌కులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వాడి వేడి విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే.. టీడీపీ ఎంత చేసినా.. ఇవి ప్ర‌జ‌ల్లోకి పెద్ద‌గా వెళ్ల‌డం లేదు. పైగా.. గ‌తంలో మీరు అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఈ స‌మ‌స్య‌లుప‌ట్టించుకున్నారా? మీరు ఏం చేశారు? ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నించే అర్హ‌త మీకు లేదు.. అంటూ..వైసీపీ నుంచి ఎదురుదాడి వ‌స్తోంది. ఇక‌, ప్ర‌జ‌లు కూడా టీడీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల ను రొటీన్ విమ‌ర్శ‌లుగానే రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నారు. స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌ను వారు ప‌రిగ‌ణించ‌డం లేదు. ఇది ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. పైగా.. వైసీపీ విష‌యంలో తాము అనుకున్న మైలేజీ కూడా రాలేదు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఉన్న జ‌న‌సేనను టీడీపీ గైడ్ చేస్తోంద‌ని అంటున్నారు. అందుకే.. త‌ర‌చుగా.. ప‌వ‌న్‌ను ఏపీలో ప‌ర్య‌టించి.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు. ప‌వ‌న్ చేసే విమ‌ర్శ‌లు ప‌దునుగా ఉండ‌డం.. ఎదురు దాడి చేసేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ కామెంట్లు యువ‌త‌లో బాగా రిఫ్లెక్ట్ అవ‌డం కూడా.. టీడీపీకి క‌లిసివ‌చ్చే అవ‌కాశం. ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయంగా ఉన్న గ్యాప్‌ను త‌గ్గించేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఈ వ్యూషం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.