‘లైగర్’ ట్రైలర్ టాక్ ఇదే… తేడా కొడుతుందా?

రౌడీ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ సవాల్ గా స్వీకరించి ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. విజయ్ – పూరి దాదాపు మూడేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కెరీర్ లోనే తొలి యాక్షన్ మూవీ ఇది. పూరి చార్మిలతో కలిసి బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీపైన భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ సినిమా విడుదల కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కోసం కూడా గత కొంత కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించి ఈరోజే విడుదల అయ్యింది. ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ఈ ట్రైలర్ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. విజయ్ ఫ్యాన్స్ మినహా మిగిలిన ప్రేక్షకులు ఈ ట్రైలర్ విషయం కాస్త అప్సెట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

విషయంలోకి వెళితే, ఈ ట్రైలర్ లో అస్సలు కథ చెప్పే ప్రయత్నం చేయలేదని భోగట్టా. కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే చూపించారు. దాంతో కొంతమంది క్రిటిక్స్ పెదవి విరిచేస్తున్నారు. గతంలో పూరి – రవితేజ కాంబోలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో దీనిని పోలుస్తూ… విమర్శిస్తున్నారు. ఆ సినిమాలో వున్న ఎమోషన్ దీనిలో రిపీట్ చేయగలడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పొతే ఏది ఏమైనా రౌడీ బాయ్స్ మాత్రం సదరు ట్రైలర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.