ఆ అసెంబ్లీ సీటుపై ఖ‌ర్చీఫ్ వేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు…!

తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల వేళ స‌రికొత్త‌గా మార‌నుంది. ఇటు బాల‌య్య‌కు చిన్న‌ల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మ‌రో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భ‌ర‌త్ రాజ‌కీయాల్లో బాల‌య్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాల‌య్య పెద్ద‌ల్లుడు భ‌ర‌త్ తోడ‌ల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పుతున్నాడు.

కానీ భ‌ర‌త్ హ‌వా ఆ రేంజ్‌లో ఉండ‌డం లేదు. అయితే తెలుగుదేశంలో తోడ‌ళ్లుళ్ల రాజ‌కీయం క‌లిసి రాదు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. చంద్ర‌బాబుకు తోడ‌ళ్లుడే అయినా వీరి మ‌ధ్య రాజ‌కీయ స‌ఖ్య‌త లేదు. ఇక ఇప్పుడు భ‌ర‌త్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తోంది. భ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఉన్న‌త విద్యావంతుడు అయిన భరత్ కి ఎంపీ కావాలన్నదే బలమైన కోరిక. అయితే ఈ సారి ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భ‌ర‌త్ భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట అయిన భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భ‌ర‌త్ ప్లాన్ చేస్తున్నారు. భీమిలిలో టీడీపీ గ‌ట్టిగా ఉంది. అయితే అక్క‌డ పార్టీకి స‌రైన క్యాండెట్‌లేరు.

ప్ర‌స్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు తాను భీమిలి నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం గంటాను గాజువాక నుంచి పోటీ చేయించి.. ప్ర‌స్తుత గాజువాక ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావును విశాఖ ఎంపీగా పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌.

ఇక విశాఖ నార్త్ నుంచి గంటా మేన‌ల్లుడిని పోటీ చేస్తే అక్క‌డ ఆర్థిక‌, అంగ బ‌లాలు అన్నీ గంటాయే స‌మ‌కూర్చుకుంటార‌న్న‌దే బాబు ప్లాన్‌. గ‌త ఎన్నిక‌ల్లో భ‌ర‌త్ ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు భీమిలిలో ఆయ‌న‌కు ఎక్కువ ఓట్లే వ‌చ్చాయి. అందుకే ఈ సారి భ‌ర‌త్ క‌న్ను భీమిలి మీదే ప‌డింది అంటున్నారు.

Share post:

Popular