ఆ ఒక్క‌టి చేస్తే.. ఈ తిప్ప‌లు త‌ప్పేవిగా బాబూ…!

ఔను! టీడీపీలోకొంద‌రు సీనియ‌ర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్ర‌బాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డింది. ప్ర‌తిప‌క్షంగా ఆప‌ని చేయ‌డంలో త‌ప్పులేదు. అయితే.. అదేస‌మ‌యంలో కేవ‌లం విరుచుకుప‌డేందుకు.. ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. పార్టీ ప‌రంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో క‌నీసం 100 స్థానాల‌ను టార్గెట్‌గా పెట్టుకుని బ‌ల‌మైన నాయ‌కుల‌ను అక్క‌డ త‌యారు చేసుకుని.. ఖ‌చ్చితంగా గెలుస్తాం.. అనే ధీమాను చంద్ర‌బాబు ఎందుకు వ్య‌క్తం చేయ‌లేక పోయార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వైసీపీని తీసుకుంటే.. 2014లో ఆ పార్టీ కేవ‌లం 67 స్థానాల్లోనే విజ‌యం ద‌క్కించుకుంది. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ప‌క్క చూపులు చూస్తార‌ని.. క‌మ్యూనిస్టులు.. ఇత‌ర‌త్రా పార్టీల‌తో జ‌ట్టు క‌డ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.. ఈ అంచ‌నాల‌కు భిన్నంగా.. జ‌గ‌న్ 175 నియోజ‌క‌వ‌వ‌ర్గాల‌పైనా త‌ను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నా రు. త‌న పార్టీ నుంచి కొంద‌రు వెళ్లిపోయినా.. ఆయ‌న బీరువు కాకుండా.. ముందుకు న‌డిచారు. ఇది పార్టీకి అన్ని విధాలా దోహ‌ద ప‌డింది. దీంతో 151 స్థానాల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఇప్పుడు కూడా జ‌గ‌న్ నిర్ల‌క్ష్యంగా లేర‌నేది వాస్త‌వం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ 175 స్థానాలను ఆయ‌న టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో వాటిలో ఎందుకు గెల‌వ‌కూడ‌ద‌నే కాన్సెప్ట్‌ను తెచ్చారు.

ఇలా.. చంద్ర‌బాబు కూడా పొత్తుల కోసం ఎదురు చూస్తూ.. ఎవ‌రో వ‌స్తారు.. ఏదో చేస్తార‌నే సూత్రాన్ని పాటించ‌డం మానేసి.. కనీసం 100 స్థానాల‌ను టార్గెట్‌గా పెట్టుకుని ఉంటే బాగుంటుంద‌ని.. సీనియ‌ర్లుచెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పొత్తులకు అవ‌కాశం లేక‌పోగా.. ఖ‌చ్చితంగా పార్టీ అధికారంలో కొన‌సాగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. రాబోయే మ‌హానాడులో అయినా.. ఈ దిశ‌గా ఒక కార్యాచర‌ణ ప్ర‌క‌టించాల‌ని..వారు కోరుతున్నారు.

Share post:

Popular