`జ‌గ‌న్ లైన్‌` దాటిన సొంత మేన‌మామ‌..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బ‌ద్ధ‌విరోధి.. ఇంకో మాట‌లో చెప్పాలంటే. బ‌ద్ధ శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే.. ఆయ‌న చంద్ర‌బాబు ఒక్క‌రే. రాజ‌కీయంగానే కాకుండా.. త‌న‌పై సీబీఐ కేసులు న‌మోదుచేయించిన కాంగ్రెస్‌తో ఆయ‌న చేతులు క‌లిపి.. రాజకీయంగా త‌నను ఎద‌గ‌కుండా చేసేందుకు కుట్ర చేశార‌నేది జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు విష‌యంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇదొక్క‌టేనా.. అంటే.. కాదు. చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాలో 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చేయించిన‌, చేయిస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారం కూడా జ‌గ‌న్‌కు మంట పుట్టిస్తోంది. ఇటు రాజ‌కీయంగాను, అటు ఆర్థికంగాను త‌న‌ను దెబ్బ‌కొట్టేందుకు కార‌కుడు చంద్ర‌బాబేన‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు అంటే.. జ‌గ‌న్ ఎగిరి ప‌డ‌తారు.. మండి ప‌డ‌తారు.. రాజ‌కీయంగా పెడబొబ్బ‌లు పెడ‌తారు. అటు అసెంబ్లీలోను, ఇటు బ‌య‌ట కూడా చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తారు. తాను చేయ‌డ‌మే కాకుండా.. త‌న పార్టీ కీల‌క నాయ‌కు ల‌తోనూ.. ఆయ‌న విమ‌ర్శ‌లు చేయిస్తార‌నే పేరుంది. అందుకే.. చంద్ర‌బాబు ఛాయ‌ల‌కు ఎవ‌రూ వెళ్లరాద‌నేది వైసీపీ సిద్ధాంతాల్లో ప్ర‌ధానమైంది. దీనిని ఎవ‌రూ అతిక్ర‌మించేందుకు వీల్లేదు. నిజానికి టీడీపీ నుంచి వ‌చ్చిన నాయ‌కులే అయినా.. చంద్ర‌బాబు ఎదురు ప‌డితే.. త‌ప్పించుకు వెళ్లిపోయారే త‌ప్ప‌.. జ‌గ‌న్ గీత‌ను దాటిన నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు లేరు.

అలాంటిది ఇప్పుడు.. జ‌గ‌న్ గీసిన గీత‌ను ఆయ‌న సొంత మేన‌మామ‌(విజ‌య‌మ్మ సోద‌రుడు), క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అతిక్ర‌మించారు. తాజాగా చంద్ర‌బాబు 73వ పుట్టిన రోజు సంద‌ర్భంగా చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోని దుర్గ‌గుడికి వెళ్లారు. యాదృచ్ఛికంగా.. అదేస‌మ‌యంలో ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కూడా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. ఆయ‌న ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆల‌య ప్ర‌వేశం చేశారు. దీంతో చంద్ర‌బాబు రావ‌డాన్ని గ‌మ‌నించిన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి.. కొద్దిసేపుఆగి.. చంద్ర‌బాబు స‌మీపంలోకి వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉన్నారు.

ఆ వెంట‌నే ఆయ‌న‌కు చేతిలో పువ్వుల‌ను అందించి.. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతేకాదు.. అప్ప‌టికే చేతిలో ఉన్న వ‌స్త్రాన్ని కూడా ఆయ‌న‌కు అందించారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు.. సోష‌ల్ మీడియాలో తెగ‌వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. జ‌గ‌న్ లైన్ అతిక్ర‌మించిన త‌న సొంత మేన‌మామ‌పై.. సీఎం ఎలా స్పందిస్తారోన‌ని వైసీపీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. దీనిని లైట్‌గా తీసుకుంటారా? లేక సీరియ‌స్‌గా స్పందిస్తారా? అని వేచి చూస్తున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో!

Share post:

Latest