జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?

హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. ఆయన వ్యూహం ఎలా ఉన్నదో గానీ.. గుంటూరు జిన్నా టవర్ మొత్తానికి సోము వీర్రాజు పుట్టిముంచేలాగానే కనిపిస్తోంది.

ఆజాదీ కా అమృత మహోత్సవ్ అంటూ.. స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు నిండుతున్న ఉత్సవాలను నిర్వహించే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది. అయితే.. ఆ ముసుగులో..అక్కడికేదో ఈ దేశానికి స్వాతంత్ర్యం తామే తెచ్చినంతగా బిల్డప్ ఇచ్చుకోడానికి, దేశ స్వాతంత్ర్య చరిత్రను మొత్తం తిరగరాయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చరిత్రలో కాషాయ రంగు పులుముకున్న కొత్త హీరోలను ఫాబ్రికేట్ చేసి.. వారు మన నెత్తిన రుద్దినా పర్లేదు. అది మన ఖర్మ అనుకోవచ్చు. అలా కాకుండా.. కాషాయ ఫ్లేవర్ లేని, ఇతర మతాలకు చెందిన వారినందరినీ చరిత్రలోని తుడిచిపెట్టేయాలని చూస్తే అలాంటి కుట్రలను ఎలా అర్థం చేసుకోవాలి?

ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోంది. గుంటూరులోని జిన్నా సెంటర్ పేరు మార్చేయాలని, ఆ సెంటర్లో ఉన్న జిన్నా టవర్ ను కూల్చివేయాలని బీజేపీ రెండురోజుల నుంచి నానా యాగీ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అద్యక్షుడు సోము వీర్రాజు పార్టీని భ్రష్టు పట్టించే చీప్ లిక్కర్ రాజకీయాలను తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. జిన్నా టవర్ విషయమే నానా రాద్ధాంతం అవుతుండగా.. సోము వీర్రాజు తన ట్వీట్లతో ఈ వివాదానికి ఇంకాస్త మసాలా పులుముతున్నారు.

గుంటూరు జిన్నా సెంటర్ పేరు మార్చడంతో పాటు, విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ పేరు కూడా మార్చాలట. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో పాత్ర పోషించిన వీరన్నకు ఆర్థర్ కాటన్ తో సమానంగా గౌరవం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇంకా నయం.. ఆర్థర్ కాటన్ పేరు తొలగించాలని సోము డిమాండ్ చేయలేదు. అలా చేసి ఉంటే ప్రజలు ఆయనను తరిమికొట్టేవాళ్లు.

మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలకే ఈ దేశంలో ముస్లింలు ఆ పార్టీని ఎప్పటికీ విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి లేదు. మోడీ రాజ్ చెలామణీలో ఉన్నంత కాలమూ.. ఈ దేశంలో ముస్లింలు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందే. ముస్లిం ఓటు ఎటూ తమకు పడదు. వారి పార్టీ హిందూత్వ ఎజెండా పుణ్యమాని.. ఈ దేశంలో క్రిస్టియన్లు కూడా ఎప్పటికీ బీజేపీకి ఓటు వేయరు. ఎటూ ఆ రెండు మతాల వారు ఓట్లు వేయరు గనుక.. వారిని మరింతగా దూరం చేసుకున్నా పర్లేదని.. జిన్నా టవర్ మీద, కింగ్ జార్జి హాస్పిటల్ మీద బీజేపీ దాడికి దిగుతున్నట్టుంది.

అయితే ఇక్కడ సోము వీర్రాజు గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి మరొకటి ఉంది. ఆ రెండు పార్టీలూ ఎటూ దూరంగానే ఉన్నాయి.. ఇప్పుడు మరింత దూరమౌతాయి .. ఇదంతా ఓకే. కానీ.. అంతమాత్రాన హిందువులందరూ గంపగుత్తగా పువ్వు గుర్తుకు ఓట్లు గుద్దేసే పరిస్థితి ఏర్పడుతుందా? మతం కార్డు వాడే ఇలాంటి నీచమైన రాజకీయాలను అసహ్యించుకునే వారు హిందువుల్లో చాలా మందే ఉంటారు. వారంతా మరింతగా బీజేపీని అసహ్యించుకుంటారు. ఆ సంగతి సోము వీర్రాజుకు అర్థమయ్యేలోగా.. జిన్నా టవర్ ఆ పార్టీ పుట్టి ముంచుతుంది.

Share post:

Popular