`ఆర్ఆర్ఆర్` ఫ్లాపైతే ఏం చేస్తారు..? స్టూడెంట్‌ ప్రశ్నకు జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్‌ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజ‌మౌళి తాజాగా ఓ కాలేజ్‌ ఈవెంట్‌లో పాల్గొని.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో ఓ స్టూడెంట్ `ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకవేళ‌ ప్లాప్ అయితే ఏం చేస్తారు` అంటూ ప్ర‌శ్నించింది. ఆమె ప్ర‌శ్న‌కు షాకైన జ‌క్క‌న్న‌.. నిజంగా ఆర్ఆర్ఆర్ ఫ్లాపైతే ఏం చేస్తానో తెలియ‌దు గానీ.. ఖ‌చ్చితంగా ఎంతో బాధ ప‌డ‌తాను. అయితే గెలుపు నుంచి కాదు.. ఓట‌మి నుంచే ఎక్కువ నేర్చుకోవ‌చ్చు. అలా నేర్చుకుని నెక్స్ట్ టైమ్ స‌క్సెస్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తా` అంటూ స‌మాధానం ఇచ్చారు.

దీంతో జ‌క్క‌న్న చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, ఆర్ఆర్ఆర్ విష‌యానికి వ‌స్తే.. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో ఈ చిత్రం ఫిక్ష‌న్ స్టోరీగా రూపుదిద్దుకుంది. ఇందులో అల్లూరిగా రామ్ చ‌ర‌ణ్‌, భీమ్‌గా ఎన్టీఆర్‌లు క‌నిపించ‌బోతున్నారు.