విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య `నారప్ప` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. తాజాగా దృశ్యం 2లో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రంలో నటిస్తున్నాడు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ ఇప్పుడు `డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఆరాటపడుతున్నారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..2019లో విడుదలైన మలయాళీ మూవీ `డ్రైవింగ్ లైసెన్స్` సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో తెలుగులోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీలో వెంకటేష్ నటించబోతున్నాడట. ఎఫ్ 3 షూటింగ్ పూర్తైన వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్‌గా డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని ప్రకటించబోతున్నాడని ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.