ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంది.

ఏపీలో సినిమా టికెట్ల ధర తగ్గింపుపై చిరంజీవి, సురేష్ బాబు, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఇదివరకే స్పందించారు. టిక్కెట్ల ధరల పై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఏపీలో టిక్కెట్ల ధరల తగ్గింపు పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

పెద్ద సినిమాలకు ఏపీలో టికెట్ల ధరలు వర్కవుట్ కావని పేర్కొంది. ఈ విషయమై ఆర్ఆర్ఆర్ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు ఏపీలో ఇప్పుడు ఉన్న టికెట్ల ధరలు.. ఏ మాత్రం వర్కౌట్ కావు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తమ సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం టికెట్ ధరలపై పునరాలోచించాలని’ దానయ్య కోరారు. తెలంగాణలో టికెట్ రేట్లపై అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు కోర్టుకు వెళ్లగా సినిమా విడుదల సమయంలో టికెట్ ధర పెంచుకునే వెసులుబాటుకు కోర్టు అనుమతించింది. ఏపీలో ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యే సరికి టికెట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం.. ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.