ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు.
తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు గల చిన్నారికి ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని ముంబైలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ రేపు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరోవైపు నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమే.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా..ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో కూడా మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదయ్యాయి. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే సంభవించింది.