నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: శ్యామ్ సింగ రాయ్
నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
డైరెక్షన్: రాహుల్ సాంకృత్యన్

నేచురల్ స్టార నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తన గత రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నాడు నాని. దీంతో ఈసారి ఎలాగైనా తన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి తన స్టామినా ఏమిటో చూపించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో కలిసి శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అయ్యాడు. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో, నానికి హిట్ ఇచ్చిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమా డైరెక్టర్‌తో తన సత్తా చాటాలని.. ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు వాసు(నాని). ఈ క్రమంలోనే తన సినిమాలో ఓ అందమైన హీరోయిన్ కావాలంటూ కీర్తి(కృతి శెట్టి)ని కలుస్తాడు. దీంతో ఆమెను ఒప్పించి తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కట్ చేస్తే.. డైరెక్టర్‌గా మంచి పేరును తెచ్చుకున్న వాసు, వరుసబెట్టి సినిమాలు చేస్తుంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. 1970లో శ్యామ్ సింగ రాయ్ రాసిన కథలను కాపీ చేస్తూ వాసు సినిమాలు చేస్తున్నాడనే ఆరోపణ అతడిపై పడుతుంది. ఇంతకీ ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? వాసు తీసిన సినిమాలు అతడి కథలను ఎలా పోలి ఉంటాయి? వాసుకి, శ్యామ్ సింగ రాయ్‌కు సంబంధం ఏమిటి? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
తన గతరెండు చిత్రాల అనుభవంతో నాని ఈసారి ఎంచుకున్న కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని చెప్పాలి. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను పీరియాడికల్ సబ్జెక్ట్‌గా మలిచిన తీరు ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా చేస్తుంది. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో స్టార్ డైరెక్టర్ కావాలనుకునే వాసు, అతడి కలను నిజం చేసుకునేందుకు అతడు పడే కష్టాలను మనకు చూపిస్తారు. అయితే ఈ క్రమంలోనే కీర్తిని పెట్టి ఓ షార్ట్ ఫిలిం తీయడం, అది సక్సెస్ కావడంతో వరుసగా సినిమా అవకాశాలు వస్తుంటాయి. ఇక డైరెక్టర్‌గా మారిన వాసు తీసే ప్రతి సినిమా కూడా సక్సెస్ అవుతుండటంతో తక్కువ సమయంలోనే మంచి డైరెక్టర్‌గా మారిపోతాడు. అయితే అతడు తీసే సినిమాలన్నీ కూడా శ్యామ్ సింగ రాయ్ రాసిన కథల ఆధారంగా ఉన్నాయని పోలీసులు అతడ్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ రావడంతో సినిమా సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుందని సదరు ఆడియెన్స్‌కు అర్థమవుతుంది.

ఇక సెకండాఫ్‌లో అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు అనే విషయాలను తెలుసుకునే క్రమంలో అతడి జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటాడు వాసు. 1970లో బెంగాలీ కుటుంబానికి చెందిన శ్యామ్ సింగ రాయ్ ఓ రాయల్ ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తన కవితల ద్వారా ఎదురించేవాడు. ఈ క్రమంలోనే అక్కడ నెలకొన్న దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు శ్యామ్ సింగ రాయ్ పోరాటం చేస్తుంటాడు. అప్పుడే మైత్రేయి(సాయి పల్లవి) అనే దేవదాసీని ప్రేమిస్తాడు శ్యామ్ సింగ రాయ్. ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని సమాజంలో నెలకొన్న ఆచారాలను ఎదురిస్తాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. అయితే ఎవరూ ఊహించని ట్వి్స్టులు, మలుపులతో ఈ సినిమా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ను అత్యద్భుతంగా మలిచాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.

ఓవరాల్‌గా శ్యామ్ సింగ రాయ్ చిత్రంపై నాని ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ఈ సినిమా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. వాసు పాత్రను పక్కకుపెడితే, శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉందని చెప్పాలి. అతడి యాటిట్యూడ్, అతడు చెప్పే డైలాగులు, అతడి బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రను ప్రేక్షకులు మెచ్చే విధంగా చేస్తాయి. మొత్తానికి రెండు వరుస పరాజయాల తరువాత నాని ఎట్టకేలకు మరోసారి హిట్ కొట్టాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. అలాంటిది నటనకు పూర్తిగా ఆస్కారం ఉన్న శ్యామ్ సింగ రాయ్ లాంటి పాత్ర నానికి పడితే ఇక రెచ్చిపోయి నటించేస్తాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. వాసు దేవ్ పాత్రలో యంగ్ డైరెక్టర్‌గా నటిస్తూనే, శ్యా్మ్ సింగ రాయ్ లాంటి రాయల్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ హీరో. ఇక హీరోయిన్లుగా నటించిన కృతి శెట్టి అందాల ఆరబోతతో ఆకట్టుకుంటే, దేవదాసీ పాత్రలో సాయి పల్లవి యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. నాని-సాయిపల్లవిల కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌లో ఒకరిని మించి మరొకరు యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు. మరో భామ మడోనా సెబాస్టియన్‌కు కూడా మంచి పాత్ర పడింది.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి ఆయువుపట్టు ఏమిటని అడిగితే ఖచ్చితంగా ఈ సినిమా కథే అని చెప్పాలి. ఫస్టాఫ్‌ను రొటీన్ కమర్షియల్ అంశాలతో నింపేసినా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ సెకండాఫ్‌పై ఎలాంటి నమ్మకం పెట్టుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఈ డైరెక్టర్. పునర్జన్మ కాన్సెప్ట్‌ను తీసుకుని ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ సినిమాటోగ్రఫీ. 1970 కాలాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. అటు మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాను మరో బలం. అతడు అందించిన పాటలు, బీజీఎం ఈ సినిమాకు బాగా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా:
‘శ్యామ్ సింగ రాయ్’ – బొమ్మ హిట్టు!

రేటింగ్:
3.25/5.0