అఖండ దెబ్బ‌కు `రాధేశ్యామ్‌`లో భారీ మార్పు..అస‌లేమైంది?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో వ‌చ్చిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డానికి బాల‌య్య న‌ట‌నా విశ్వ‌రూపం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌తో పాటు త‌మ‌న్ అందించిన సంగీతం కూడా కీల‌క పాత్ర పోషించింది. సినిమా విడుద‌ల త‌ర్వాత అంద‌రూ త‌మ‌న్ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నారు.

ఈ నేథప‌థ్యంలోనే ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`లో భారీ మార్పు చేశార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాధే శ్యామ్ కి ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వెర్షన్ పాటలని జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేస్తుండగా, హిందీ వెర్షన్ కి వస్తే మిథున్, ఆమాల్ మాలిక్, అర్జిత్ సింగ్, మాన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తమన్ ని తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. సౌత్‌ మాత్రమే కాకుండా హిందీకి కూడా జస్టిన్‌ ప్రభాకరనే ఆర్‌ఆర్‌ అందించారు. కానీ, ఇప్పుడు త‌మ‌న్ చేత రీరికార్డింగ్ చేయించేందుకు ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

కాగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.