రంగంలోకి మెగాస్టార్..

ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతోందని, థియేటర్లపై ఆంక్షలు సరికాదని పలువురు సినీ పెద్దలు పేర్కొంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కేవలం నాని మాత్రమే జస్ట్ ఓ కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు బిజీగా ఉంటోంది అని పేర్కొన్నారు. తను హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ అప్పుడే విడుదల కావడం.. ఏపీ సర్కారు థియేటర్లపై ఉక్కు పాదం మోపడంతో కలెక్షన్లు తగ్గిపోయాయనేది ఆయన బాధ. అయితే టికెట్ రేట్లు తగ్గించడంతోపాటు దాడులు చేసి మూసివేయడం సరికాదని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై సినీ పెద్దలు తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇలా అయితే సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతుందని పలువురు మెగా స్టార్ ద్రుష్టికి తీసుకెళ్లారు. మీరే చొరవ తీసుకొని ఏపీ సర్కారుతో మాట్లాడాలని కోరారని సమాచారం. దీంతో చిరంజీవి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇస్తే సీఎం జగన్ తో మాట్లాడతానని చెప్పినట్లు తెలిసింది. థియేటర్లలో సినిమా టికెట్లు ధరలు తగ్గించడం వల్ల థియేటర్ల నిర్వహణే కష్టమవుతుందని, మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన ఇప్పటికే ఏపీలోని ప్రముఖ నాయకులతో చెప్పారు. సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి పేర్ని నానిని చిరంజీవి కోరారు కూడా.

ఆన్ లైన్ విధానాన్ని చిరంజీవి సమర్థిస్తూనే ధరల గురించి ఆలోచించాలని కోరుతున్నారు. జగన్ తో ఒకవేళ మెగాస్టార్ సమావేశం అయితే తనతోపాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులను తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. అధికారులు తీసుకుంటున్న చర్యలతోపాటు సినిమా టికెట్ల ధరల తగ్గింపు వల్ల రాష్ట్రంలో దాదాపు 130 థియేటర్లు మూతపడ్డాయని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. మరి ఏపీ సీఎం జగన్ .. చిరంజీవికి అపాయింట్ మెంట్ ఎప్పుడు ఇస్తాడో, అసలు ఇస్తాడో, లేదో.. ఇచ్చినా ఎవరెవరికి అవకాశం కల్పిస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి.