గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను ఎంపిక చేయడం అనూహ్యంగా జరిగిపోయాయి. అసలు గద్వాలను మేయర్ చేయడం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కూడా అస్సలు ఇష్టం లేదట. అయితే ఆమె తండ్రి, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన కే.కేశవరావు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాడని..విధిలేని పరిస్థితుల్లో గద్వాలను మేయర్ చేశారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో కేటీఆర్ కూడా తానేం చేయలేనని ఓ దశలో చేతులెత్తేసినట్లు సమాచారం. ఆమె ఎవరినీ కలవడం లేదు.. అని పలువురు కార్పొరేటర్లు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. నగరంలో జరిగే కార్యక్రమాలకు తప్ప జూబ్లిహిల్స్‌లోని ఇంటికే పరిమితమవుతోందని.. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఎలా అని కార్పొరేటర్లు వాపోతున్నారు. ప్రజలకు కాకపోయినా కనీసం గ్రేటర్ కార్పొరేటర్లకు అందుబాటులో ఉండాలని ఆమెకు సూచించాలని, లేకపోతే ప్రత్యామ్నాయం అయినా చెప్పాలని కేటీఆర్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో కేటీఆర్ కూడా మౌనముద్ర దాలుస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేజేతులా ప్రతిపక్ష పార్టీకి విమర్శించేందుకు అవకాశమిచ్చినట్లవుతుందని, జనం దృష్టిలో కార్పొరేటర్లు ఏమీ చేయలేకపోతున్నారని అనుకుంటారని పేర్కొన్నట్లు తెలిసింది. మరి పార్టీ అధిష్టానం మేయర్ వ్యవహారశైలిపై ఏం చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.