మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే ధీమ చిత్ర యూనిట్లో ఉంది.
కానీ ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకుంటూ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే అఖండ, పుష్ప చిత్రాలు రిలీజ్ కాగా అవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో పలు భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటం, ఆ తరువాత ఫిబ్రవరిలో కూడా ఒకట్రెండు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో గని చిత్రాన్ని ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ క్రమంలోనే గని చిత్రాన్ని ఏకంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో అయితే మరే తెలుగు సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు ఫిక్స్ చేసుకోలేదని, ఆ సమయంలో కరోనా భయం కూడా జనంలో పూర్తిగా తొలిగిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర, సునీల్ శెట్టిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.