మోదీని కలవాలనుంది…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్‌ పార్టీ పవర్‌లోకి వచ్చిన తరువాత చాలా మంది నాయకులు .. తమను ప్రభుత్వం కేసుల రూపంలో వేధిస్తుందేమోనని భయపడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరిపోయారు. టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లాంటి అగ్రనేతలు బీజేపీ గూటికి చేరిపోయారు.

వీరంతా కషాయం పార్టీలో చేరినా టీడీపీ అధినేతతో టచ్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. మరో విషయమేమంటే.. వారందరినీ చంద్రబాబు నాయుడే బీజేపీలోకి వెళ్లాలని సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీన్‌ కట్‌చేస్తే… జగన్‌ సీఎం సీటులో కూర్చొని అప్పుడే మూడేళ్లయింది. రోజు రోజుకూ టీడీపీని వైసీపీ టార్గెట్‌ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ఇక బయట మీడియా ఎదుట వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని తీసుకొని.. తన కుటుంబంపై పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి కోసం ప్రయత్నించారు. అయితే ఆ ప్లాన్‌ బెడిసి కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు జరపాలని కూడా టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. మరి ఆ కార్యక్రమం ఎప్పుడు చేస్తారో ఆపార్టీ నాయకులకే తెలియాలి. ఇలా…రోజులు గడిచిపోతున్నాయి. ఎన్నికలకు పెద్ద సమయం లేదు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే విజయం కష్టమే.. రాజకీయ ఉద్ధండుడు చంద్రబాబుకు ఇది ఆల్రెడీ తెలుసు.

అందుకే ముందుచూపుతో ముందుకెళ్లాలనే ప్లాన్‌ వేస్తున్నాడు. అప్పట్లో ఎన్‌డీఏలో ఉండి.. ఎన్నికలకు ముందు మోదీతో విభేదించి బయటకు వచ్చాడు. కొన్ని సంవత్సరాల పాటు మోదీ, చంద్రబాబు కలిసింది లేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మోదీ గురించి ఆలోచిస్తున్నాడు. బీజేపీతో కలిసి పోవాలని..కలిసి ఎన్నికల అడుగులు వేయాలని భావిస్తున్నాడు. అందుకే తమ పార్టీ ఎంపీలను, టీడీపీనుంచి బీజేపీలో చేరిన శిష్యులకు మోదీతో సమావేశం ఏర్పాటు చేయించడి అని కోరుతున్నారట. మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలాగైనా తీసుకోండి అని చెబుతున్నారట. పార్లమెంటు సమావేశాలు జరిగే ఈ సమయంలోనే మోదీ, అమిత్‌ షాలను కలిసి తన మనసులో మాట చెప్పాలని భావిస్తున్నారట. టీడీపీ నాయకులు హస్తినలో ఇదే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఒకవేళ చంద్రబాబు నాయుడు.. మోదీని కలిస్తే మాత్రం రాజకీయ సమీకరణలు మారే అవకాశాలన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.