`అఖండ‌`తో స‌హా బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు ఇవే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి వారం రోజులు గ‌డిచినా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అలాగే ఈ సినిమాలో శివుడు అలియాస్ అఖండగానూ, ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో రఫ్ ఆడించేసాడు. మొత్తానికి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బాల‌య్య‌.. అఖండ కాకుండా తన కెరీర్‌లో మ‌రెన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి ఆక‌ట్టుకున్నారు. మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ చిత్రాలేవో ఓ లుక్కేసేయండి.

బాలయ్య ఫస్ట్ డ్యుయెల్ రోల్ చేసిన సినిమా `అపూర్వ సహోదరులు`. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం 1986 అక్టోబర్ 9 న విడుదలైంది.

రెండో సారి బాల‌య్య `రాముడు భీముడు` ద్విపాత్రాభినయం చేశాడు. కె. మురళీమోహనరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 1988 లో రిలీజ్ మంచి విజ‌యం సాధించింది.

సింగీతం శ్రీనివాసరావు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన‌ `ఆదిత్య 369` సినిమాలో బాల‌య్య శ్రీకృష్ణదేవరాయులుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో న‌టించి మెప్పించారు.

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో డ్యుయెల్ రోల్ చేసిన బాల‌య్య‌.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వ‌చ్చిన `మాతో పెట్టుకోకు` మూవీలోనూ రెండు పాత్ర‌ల‌ను చేశాడు.

అలాగే శరత్ ద‌ర్శ‌క‌త్వంలో `పెద్దన్నయ్య`, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో `శ్రీకృష్ణార్జున విజయం`, శరత్ దర్శకత్వంలో `సుల్తాన్‌`, వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `చెన్నకేశవరెడ్డి`, జయంత్ సి పరాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో `అల్ల‌రి పిడుగు`, వై.వి.ఎస్.చౌదరి ద‌ర్శ‌త్వంలో `ఒక్క మగాడు`, కే.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో `పాండురంగడు` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాడు.

ఇవే కాకుండా పరమవీరచక్ర, అధినాయ‌కుడు, లెజెండ్ చిత్రాల్లోనూ బాల‌య్య డ్యుయెల్ రోల్ చేశాడు.