తగ్గేదేలే : ఇండియా లెవెల్లో పుష్ప సెన్సేషనల్ రికార్డు..!

అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈనెల 17వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ స్లోగా ఉందని కామెంట్స్ వినిపించాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తో దూసుకుపోతోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, అల్లు అర్జున్ మేకోవర్, రియలిస్టిక్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. దీంతో అక్కడ మూడు రోజుల్లోనే 11 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక కర్ణాటక, కేరళలలో కూడా పుష్పకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు, మూడో రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. అయితే బాలీవుడ్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఎవరికీ లేవు. అందుకే మేకర్స్ ప్రమోషన్లు కూడా అంతంతమాత్రంగానే చేపట్టారు. అయినప్పటికీ అక్కడ అల్లు అర్జున్ తన సత్తా చాటుకున్నాడు.

పుష్ప మొదటి రోజు అక్కడ మూడు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 173 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన తర్వాత ఫస్ట్ వీక్ ఎండ్ సండే పుష్పకు దేశ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు వచ్చాయి. రూ.173 కోట్లతో 2021లో దేశంలోనే అత్యంత బిగ్గెస్ట్ గ్రాసర్ గా పుష్ప నిలిచింది. ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సూర్య వంశీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా పుష్ప అంతకుమించి విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది.