శ్యామ్ సింగ రాయ్.. నాని కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ టీజర్స్ చూస్తే అర్థమవుతోంది.

కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో నాని బెంగాలీ బాబులా దర్జాగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో శ్యామ్ సింగ రాయ్‌గా నటించాల్సింది నిజానికి నాని కాదట. ఈ సినిమా కథను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మరో హీరో రానా దగ్గుబాటి వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అయితే ఈ పాత్ర తనకు సెట్ కాదని, ఈ సినిమా నానికైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని రానా సూచించాడట.

దీంతో డైరెక్టర్ రాహుల్ నేరుగా నాని వద్దకు ఈ సినిమాను తీసుకెళ్లగా అలా ఈ సినిమా రెడీ అయినట్లు దర్శకుడు తెలిపాడు. ఏదేమైనా నాని కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాగా శ్యామ్ సింగ రాయ్ నిలవబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.