దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు మళ్లీ ఉద్యమబాటలో నడవనున్నారు. విభజన హామీలు, ధాన్యం కొనుగోళ్లు, నీళ్లు, నిధులు.. ఇలా అనేక సమస్యలను కేంద్రం పరిష్కరించలేదు. కనీసం ఆ దిశగా కూడా అడుగులు వేయడం లేదు. దీంతో ఢిల్లీలోనే తేల్చుకోవాలని, అందుకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. స్వయంగా సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ఢిల్లీలో ఆందోళన చేయాలని నిర్ణయించారు.

మరో అడుగు ముందుకేసి.. ఈ సాయంత్రం 4 గంటలకు పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏం చేయాలి.. ఎలా చేయాలనే దానిపై అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి విషయాన్నీ రాష్ట్రంపై తోసేస్తే ప్రజల్లో చులకన అయిపోతాం.. అన్నీ మనమే చేస్తే ఇక కేంద్రం ఉన్నదెందుకు అని టీఆర్ఎస్ నేతల ఫీలింగ్. ఎప్పటికప్పుడు చెక్ చెప్పకపోతే బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుందని భయం. కేంద్రం తీరును నిరసిస్తూ మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసన కార్యక్రమలు సక్సస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ టెంపోను ఇలాగే కంటిన్యూ చేయడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. వరిని కేంద్ర ప్రభుత్వం కొనబోమని ఎక్కడా చెప్పలేదే అని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం కూడా కేసీఆర్ లో గుబులు మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలుకే ఎసరు వస్తుంది.. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనేది సారు ఫీలింగ్.