ఢిల్లీకే కవిత.. ఇదే కన్ఫర్మ్

ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోతోంది.. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి..అయితే.. మండలిలోకి మళ్లీ ఏం వెళతాం అనే అభిప్రాయంలో ఉన్నారు సీఎం కూతురు కల్వకుంట్ల కవిత. మరేం చేద్దాం.. ఏదో ఒక చట్టసభలో ఆమెకు స్థానం కావాలి.. రాజ్యసభకు పంపిద్దాం.. అరె.. అక్కడ ఖాళీల్లేవుగా.. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ముక్క పడాల్సిందే.. ఇపుడు అచ్చం తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. ఆ పార్టీకి చీఫ్, ప్రభుత్వానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఇక ఆయన తలచుకుంటే పదవులకేంటి..అందుకే కూతురు కవిత కోసం ఢిల్లీలో ఓ సీటు ఖాళీ కావాలి.. మరి ఆసీటు ఖాళీ చేయిస్తే ఆ వ్యక్తికి ఏం ఇవ్వాలనే తర్జనభర్జన.. ఈ సమీకరణాల మధ్య సోమవారం ఒక్కసారిగా బండా ప్రకాశ్ పేరు బయటకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు అయిన బండా ప్రకాశ్ ను కేసీఆర్ ఎమ్మెల్సీగా పంపనున్నారు. అంటే రాజ్యసభ సీటు ఖాళీ చేయిస్తారు. ఆ ప్రాంతంలో కవితను ఫిలప్ చేస్తారన్నమాట. సడన్ గా బండా ప్రకాశ్ పేరు బయటకు ఎందుకొచ్చిందబ్బా అని ఆలోచిస్తే కవిత సమాధానంగా కనిపించారు. ఇక్కడ ప్రాణం తీశా.. అక్కడ ప్రాణం పోశా..లెవెలైపోయింది.. అనేది ఓ సినిమాలో డైలాగ్.. అయితే ఇక్కడ మాత్రం అక్కడ తప్పించా.. ఇక్కడ కూర్చోబెడతా.. లెవలైపోయింది అన్నట్లుంది ఈ పొలిటికల్ సినిమాలో..

ఇంకా అనధికారికమే..

రాజ్యసభ సభ్యత్వానికి కల్వకుంట్ల కవితను పంపిస్తారనేది ప్రస్తుతానికి ఇంకా నిర్ణయించలేదు. లోపాయికారిగా ఈ ఒప్పందాలు జరిగిపోయాయి కానీ.. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి కొత్త సభ్యులు ప్రమాణం చేసి.. ఆ తరువాత ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ తరువాత దానిని చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదించాలి. ఆ తరువాతే కవితకు లైన్ క్లియర్ అవుతుంది. మరి.. అంతరవకు ఈ రాజకీయాల్లో ఏం మార్పులస్తాయో..పొలిటికల్ స్క్రీన్ పై చూడాల్సిందే.