తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. అలాంటపుడు ఎవరి బతుకును వారు బతకకుండా అపహాస్యం, అవహేలన చేయడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఫైరయ్యారు. ’తెలంగాణ వస్తే మీరు అడుక్కు తింటరని మనల్ను అన్నడు.. కానీ ఆంధ్రలో జగనే అడుక్కుతింటున్నడు..ఆంధ్రోళ్లు బిచ్చమెత్తుకుంటున్నరు.. రోజు నడవాలంటే కేంద్రం నుంచి లోన్ రావాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి సడన్ గా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడిన వేదిక ఏది అంటే మహాధర్నా.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలనే డిమాండ్ తో నిజామామాద్ లో జరిగిన ధర్నాలో ఈ మాటలన్నాడు. కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమంలో మంత్రికి సడన్ గా జగన్ ఎందుకు గుర్తుకొచ్చాడనేది ఎవరికీ అర్థం కాలేదు. మరి ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఘాటుగా స్పందించారు. ఇంటి బయట కాలరెగరేసి..లోపలకు వెళ్లి కాళ్లు పట్టుకోవడం మా చేతకాదు.. ఢిల్లీకి మీరు కూడా ఎందుకెళతారో అందరికీ తెలుసని నాని మీడియాతో పేర్కొన్నారు. మరి ఈ గొడవ చివరకు ఎక్కడకు వెళుతుందో చూడాలి.