అద్భుతం.. నేరుగా చూసేయడమే!

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో కనిపించదట.

అద్భుతం చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌లో నవంబర్ 19న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో వారి పాత్రలు సరికొత్తగా ఉంటాయని, ప్రేక్షకులను వారు తమ పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాకు రాడాన్ సంగీతం అందిస్తుండగా, చంద్రశేఖర్ మొగుళ్ల ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి అద్భుతం చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించి నిజంగానే అద్భుతం చేస్తుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.