మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. మరికొంత సేపట్లో మూడు రాజధానులు బిల్లు పై సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిని కార్యనిర్వాహక రాజధానిగా కొనసాగిస్తూనే.. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రవేశ పెట్టింది.

కాగా మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలువురు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇవాళ కూడా హైకోర్టులో మూడు రాజధానుల బిల్లుపై విచారణ జరుగగా.. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై మరింత స్పష్టత ఇవ్వాలని కోర్టు కోరింది.

దీనిపై అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరిస్తూ మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై కొద్దిసేపట్లో సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేస్తారని విన్నవించారు. అనంతరం కోర్టు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణను వాయిదా వేసింది.

సాంకేతిక సమస్యల పరిష్కారం కోసమే: పెద్దిరెడ్డి

కాగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. శుభం కార్డుకు మరికొంత సమయం ఉందని వ్యాఖ్యానించారు. బిల్లులో ప్రభుత్వం సాంకేతికపరంగా చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు కోసం మాత్రమే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఉంటుందని ఆయన చెప్పారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయం కాదని అన్నారు. అమరావతి ఉద్యమం కేవలం ఒక పెయిడ్ ఉద్యమం అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను చూసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను ఇప్పటికీ మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

కాగా మూడు రాజధానుల బిల్లు ఏర్పాటుపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పటినుంచి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీని గురించి కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి ఇప్పుడున్న రూపాన్ని పూర్తిగా మార్చి, మళ్లీ మూడు రాజధానుల ఏర్పాటు పై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈసారి మాత్రం బిల్లులో ఎటువంటి తప్పులు చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.