కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం టార్గెట్‌ చేసే కిషన్‌ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్‌గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్‌ రెడ్డి కేవలం తన శాఖాపరమైన పనుల్లో బిజీగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చరాదని, కేంద్ర మంత్రి పనులు మాత్రమే చేయాలని చెప్పినట్లు తెలిసింది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ టార్గెట్‌ చేశారు. బండి సంజయ్‌ కేసీఆర్‌ను ఓ రేంజిలో విమర్శిస్తారు. మరి అదే సమయంలో కిషన్‌ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ పై విమర్శలు చేస్తే మీడియాలో బండి సంజయ్‌కు పెద్ద ప్రాధాన్యత రాదు..పార్టీకి పెద్దగా మైలేజీ రాదు.. అనేది బీజేపీ పెద్దల ఉద్దేశం. కిషన్‌ రెడ్డి రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు కేవలం తన అసెంబ్లీ నియోజకవర్గమైన అంబర్‌పేటలో మాత్రమే వ్యవహారాలు చూసుకుంటారు. అంతేకాక తనను గెలిపించిన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం పర్యవేక్షిస్తున్నారు. పొలిటికల్‌గా కిషన్‌ రెడ్డి సైలెంట్‌గా ఉండటం వల్ల బండి కాస్త దూకుడు పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పార్టీ ఆదేశించిన పనులు మాత్రం తూచా తప్పకుండా కిషన్‌ రెడ్డి పాటిస్తున్నారు. ఎంతైనా ఆయన బీజేపీ వీరవిధేయులు కదా..!

Share post:

Latest